Andhra Pradesh: చంద్రబాబు ఎప్పుడో మునిగిపోయారు.. కొత్తగా ముంచాల్సిన అవసరం మాకు లేదు!: అంబటి రాంబాబు
- 2009 తర్వాత కృష్ణాకు వరద వచ్చింది
- ఇదంతా జగన్ సీఎం అయిన వేళావిశేషమే
- తాడేపల్లిలో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లో 2009 తర్వాత జలాశయాలు ఈ స్థాయిలో కళకళలాడుతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ ప్రజలు గత ఐదేళ్లలో కరవుకాటకాలతో అల్లాడిపోయారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వేళావిశేషం కారణంగా కృష్ణా నదికి పదేళ్ల తర్వాత వరద వచ్చిందని చెప్పారు. తాడేపల్లిలో ఈరోజు అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జలాశయాలు అన్నీ నిండి రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఏమో ‘నా ఇల్లును ముంచేస్తున్నారు’ అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
వరదను అంచనా వేసేందుకు డ్రోన్లను వాడితే చంద్రబాబు అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు. అక్రమ కట్టడాలకు ముప్పు వుందని రివర్ కన్జర్వేటివ్ బోర్డు ముందుగానే చెప్పింది. చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు. ఇప్పుడు ఆయన్ను కొత్తగా ముంచాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ప్రతిపక్ష నేత అక్రమ కట్టడంలో ఉండటం సరైనది కాదు. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా కరకట్ట ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలి’’ అని సూచించారు.