Andhra Pradesh: చంద్రబాబు సామాన్లను బయట పడేయాలన్న టార్గెట్ తో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది!: వర్ల రామయ్య
- అన్ని ఇళ్లను మొదట ఖాళీ చేయమనండి
- మేం కూడా నిబంధనల మేరకు ఖాళీ చేస్తాం
- ఆర్కేకు చంద్రబాబు ఇంటిదగ్గర ఏం పని?
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన ఇంటిని ఖాళీ చేయాలని తాడేపల్లి ఎమ్మార్వో ఈరోజు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటిలో ఎవ్వరూ లేకపోవడంతో చంద్రబాబు నివాసానికి వీఆర్వో నోటీసులు అంటించారు. వరద నీరు మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున కరకట్టపై ఉన్న ఇళ్లన్నీ ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఈ విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఇంటిని ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఓ బూచిగా చూపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఇచ్చినట్లు తమకూ నోటీసులు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు.
‘ఈ కరకట్టపై ఉన్న అన్ని ఇళ్లను ఖాళీ చేయించుకుని రమ్మనండి. చంద్రబాబు గారి ఇంటినే మొట్టమొదట ఖాళీ చేయించాలి, ఆయన సామాన్లను బయటపడేయాలన్న టార్గెట్ తో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇది కరెక్ట్ కాదండి. దీన్ని మాత్రమే మేం తప్పుపడుతున్నాం. అన్ని ఇళ్లను ఖాళీ చేయించాం. మీరు కూడా చేయండి అంటే అందుకు మేం రెడీనే. వరదలోనే ఉంటామని మేం చెప్పడం లేదే. కక్షలు ఎందుకు? ఓ ప్రోసీజర్ ప్రకారం ముందుకు వెళ్లమని చెబుతున్నాం.
ఈ దగాకోరు, పనికిమాలిన రాజకీయం ఎందుకు? చంద్రబాబు ఈరోజు హైసెక్యూరిటీ వ్యక్తి అని ఈరోజు గుర్తుకు వచ్చిందా? నిన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగిరినప్పుడు రెవెన్యూ అధికారులకు ఇది గుర్తుకురాలేదా? ప్రభుత్వం మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకొకటి చేస్తోంది. అసలు చంద్రబాబు ఇంటి దగ్గరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రావాల్సిన అవసరం ఏంటి? మేం టీడీపీ నేతలం కాబట్టి మా నాయకుడి ఇంటి దగ్గరకు వచ్చాం. ఆర్కే, ఇతర వైసీపీ నేతలు రోజూ ఇక్కడకు వస్తున్నారు. మంగళగిరిలో చాలా గ్రామాలు నీట మునిగినా, ఆళ్ల రామకృష్ణా రెడ్డి వాటిని పట్టించుకోకుండా ఇక్కడ తిరుగుతున్నారు. వీళ్లందరూ కూడా చంద్రబాబు మీద కక్ష తీర్చుకున్నాం అని చెప్పడం కోసమే ఈ రకంగా చేస్తున్నారు’ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.