Narendra Modi: చిన్నారుల పట్ల మోదీ వాత్సల్యానికి అచ్చెరువొందిన భూటాన్ ప్రధాని
- భూటాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
- రెండ్రోజుల పర్యటన
- పారో ఎయిర్ పోర్టులో మోదీకి ఘనస్వాగతం
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం పొరుగుదేశం భూటాన్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పారో విమానాశ్రయంలో భూటాన్ వర్గాలు మోదీకి ఘనస్వాగతం పలికాయి. చిన్నారులు మోదీకి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అంతేకాదు, కాన్వాయ్ ప్రయాణించినంత మేర రోడ్డుకు ఇరువైపులా భారత జెండాలు పూనిన బాలబాలికలు శుభాకాంక్షలు చెబుతూ కనువిందు చేశారు. బాలలు తనకు స్వాగతం పలకడం పట్ల భారత ప్రధాని మురిసిపోయారు. దీనిపై భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్ ట్విట్టర్ లో తన స్పందన వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ తమ దేశ విద్యార్థుల స్వాగతానికి ప్రతిస్పందించిన వైనం వ్యక్తిగతంగా ఎంతో ముగ్ధుడ్ని చేసిందని పేర్కొన్నారు. "ఎయిర్ పోర్టు నుంచి థింపు నగరం వెళ్లే క్రమంలో టీచర్లు, విద్యార్థులు, గ్రామస్తులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కూడా ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ చర్యల ద్వారా ఆయన ఎంతటి నిరాడంబరమైన వ్యక్తో, ఎంతటి వాస్తవిక మనస్తత్వం ఉన్న వాడో వెల్లడైంది. పిల్లల పట్ల మోదీ ఆపేక్ష స్పష్టంగా కనిపించింది" అంటూ షెరింగ్ పేర్కొన్నారు.