New Delhi: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం... ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ
- విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
- తీవ్ర భయాందోళనలకు గురైన రోగులు, వారి సంబంధీకులు
- రంగంలోకి దిగిన 22 ఫైరింజన్లు
ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సముదాయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ప్రారంభమైన మంటలు కొద్దిసేపట్లోనే వ్యాపించాయి. దాంతో ఎయిమ్స్ అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించగా, 22 ఫైరింజన్లను అక్కడికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంటలు చెలరేగడంతో రోగులు, వారి సంబంధీకులు హడలిపోయారు. ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. మొదటి అంతస్తు మంటలు, పొగతో నిండిపోయింది. కాగా, ఎయిమ్స్ లో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కూడా అత్యవసర చికిత్స పొందుతుండడంతో ఆందోళన నెలకొంది. అయితే ఆయనకు ఎయిమ్స్ ప్రాంగణంలోని మరో భవనంలో చికిత్స నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం.