Polavaram: పోలవరం రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ విడుదల
- రూ.4,987 కోట్ల విలువైన పనులకు నోటిఫికేషన్ జారీ
- నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా నోటిఫికేషన్
- సోమవారం నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్న నోటిఫికేషన్
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టాక పోలవరం ప్రాజక్టు పాత టెండర్లను రద్దు చేయడం తెలిసిందే. పోలవరం నిర్మాణ పనులకు రివర్స్ టెండరింగ్ లో బిడ్లను కోరాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం రూ.4,987 కోట్ల విలువైన పనులకు ఈ నోటిఫికేషన్ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా అంచనాల నేపథ్యంలో పోలవరం పనుల్లో రూ.3,600 కోట్ల మేర పెంపుదల చోటుచేసుకుందని కమిటీ పేర్కొంది.
ఈ రివర్స్ టెండరింగ్ లో భాగంగా పోలవరం హెడ్ వర్క్స్ కు రూ.1,887 కోట్లతో, పవర్ హౌస్ నిర్మాణానికి రూ.3,100 కోట్లతో బిడ్లను కోరుతున్నట్టు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ లో ఇనీషియల్ బెంచ్ మార్క్ కింద రూ.4,900 కోట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు పూర్తి నోటిఫికేషన్ ను ఈ-టెండరింగ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. సోమవారం నుంచి వెబ్ సైట్ లో నోటిఫికేషన్ దర్శనమివ్వనుంది.