Telangana: ‘తెలంగాణ’లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది: జేపీ నడ్డా

  • ప్రపంచానికి ‘ఆయుష్మాన్ భారత్’ పథకం నచ్చింది
  • కానీ, తెలంగాణ సీఎంకు మాత్రం నచ్చలేదు!
  • దశాబ్దాల కశ్మీర్ సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించింది

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ సహా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన నడ్డా వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి నచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ సీఎంకు నచ్చకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగానే ఎయిమ్స్ మంజూరు చేశామని చెప్పారు.

కశ్మీర్ పై మోదీ సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ కృతఙ్ఞతలు చెబుతున్నానని, దశాబ్దాల కశ్మీర్ సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా, బీజేపీ సభ ముగిసిన అనంతరం బీజేపీ కార్యాలయానికి ఆయన బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, పురపాలక ఎన్నికలు, సభ్యత్వ నమోదుపై చర్చించారు.

  • Loading...

More Telugu News