Karnataka: గణనీయంగా తగ్గిన కృష్ణమ్మ వరద... మూసుకోనున్న ఆల్మట్టి గేట్లు!
- కర్ణాటకలో తగ్గిన వర్షాలు
- ఆల్మట్టికి 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- ఇక రిజర్వాయర్లను నింపే పనిలో అధికారులు
కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టికి వస్తున్న వరద గణనీయంగా తగ్గింది. దీంతో గడచిన రెండు వారాలుగా తెరచుకుని ఉన్న డ్యామ్ గేట్లు నేడో, రేపో మూసుకోనున్నాయి. ఆపై వచ్చే నీటిని డ్యామ్ పూర్తిగా నింపేందుకు వాడుకోవాలని కర్ణాటక అధికారులు ఆలోచిస్తుండటమే ఇందుకు కారణం. గత 10 రోజులుగా ఉరకలు పెట్టిన కృష్ణమ్మ, నేడు కాస్తంత శాంతించింది. నిన్న సాయంత్రం ఆల్మట్టిలోకి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. దిగువకు లక్షన్నర క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరోవైపు ఈ నీరు నారాయణపూర్ చేరుతుండగా, అక్కడి నుంచి లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
దీంతో జూరాలకు రేపటి నుంచి వచ్చే వరద నీరు భారీగా తగ్గనుంది. ఇదే సమయంలో కృష్ణా, భీమా నదుల నుంచి వరద కొనసాగుతూ ఉంది. శ్రీశైలం జలాశయానికి 5.98 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.73 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తూ, రిజర్వాయర్ లో నీటిమట్టాన్ని పెంచే పనిలో అధికారులు ఉన్నారు. కాలువలకు విడుదల చేస్తున్న నీటిని వదిలేస్తే, నాగార్జున సాగర్ లోకి 4.24 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దాన్ని కిందకు వదులుతున్నారు. వరద మరింతగా తగ్గితే, కొన్ని గేట్లను మూసివేస్తామని అధికారులు అంటున్నారు.