Tollywood: టాలీవుడ్ సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలు కల్పించాలి: ‘మా’ అధ్యక్షుడు నరేశ్
- చిత్ర పరిశ్రమలోని సంఘాలకు ‘మా’ వినతి
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవిత, రాజశేఖర్
- ‘మా’ సభ్యులుగా ఉండి అవకాశాలు లేని నటులను ప్రోత్సహించాలని వినతి
టాలీవుడ్ సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ కోరారు. ఈ విషయమై తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం, నిర్మాతల మండలి, రచయితల సంఘం అధ్యక్షులకు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ చైర్ పర్సన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడికి ‘మా’ తరపున కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ముఖ్యంగా ‘మా’ సభ్యులుగా ఉండి అవకాశాలు లేని నటులను ప్రోత్సహించాలని ఆ వినతిపత్రంలో కోరారు. ఆయా సంఘాల తరపున ఎన్.శంకర్, సి.కల్యాణ్, వై.సుప్రియ, అమ్మిరాజు లను వీరు కలిశారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవిత, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు హీరో రాజశేఖర్, ‘మా’ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, చాలా మంది ‘మా’ సభ్యులకు సినిమాల్లో నటించే అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారని, ముఖ్యంగా, మహిళా నటులు చాలా బాధల్లో ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ని ఏర్పాటు చేసి, అందులో నటుల వివరాలు, ఫోన్ నెంబర్లతో పాటు, వాళ్లు నటించిన చిత్రంలోని ఒక వీడియోని కూడా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
అనంతరం, హీరో రాజశేఖర్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాలను కలిసి ఈ వినతిపత్రం సమర్పించామని, సహకరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.