Jammu And Kashmir: ముజఫరాబాద్ ను భారత్ ఆక్రమించుకుంటుందనే ఆందోళనలో పాక్.. ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాల ఫైర్
- పీవోకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందనే ఆందోళనలో పాకిస్థాన్
- భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో ఘోర వైఫల్యం
- ఇదొక అంతర్జాతీయ కుట్ర అన్న జేయూఐ(ఎఫ్)
శాంతిని కోరుకునే దేశంగా భారత్ ఉన్నంత కాలం దాయాది దేశం పాకిస్థాన్ చేసిన కుట్రలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన నేపథ్యంలో... పీవోకేను కూడా లాక్కుంటామంటూ భారత్ ప్రకటించడంతో... ఆ దేశానికి ముచ్చెమటలు పడుతున్నాయి. రోజుల వ్యవధిలో జమ్మూ కశ్మీర్ లో మారిపోయిన పరిస్థితులతో పాక్ నేతలు, సైన్యాధికారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అంతర్జాతీయ సమాజం తమకు అండగా ఉంటుందని భావించినా... చైనా మినహా మరెవరూ పట్టించుకోకపోవడంతో... ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నిలిచారు. ఈ నేపథ్యంలో, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విపక్ష నేతలు మండిపడుతున్నారు.
పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక డాన్ కథనం ప్రకారం... ఆర్టికల్ 370 రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పాక్ లోని విపక్షాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి వచ్చాయి. భారత్ ఇంత చేసినా, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టడంలో దారుణంగా విఫలమయ్యారని విమర్శిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సొంత దేశంలో కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని డాన్ తెలిపింది.
కశ్మీర్ భవిష్యత్తును సమూలంగా మార్చివేసే నిర్ణయాన్ని భారత్ తీసుకున్నా పాకిస్థాన్ మౌనంగా ఉండాలనే నిర్ణయాన్ని అమెరికాలో ట్రంప్, ఇమ్రాన్ ల భేటీ సందర్భంగా తీసుకున్నారనే భయాందోళనలు ఇప్పుడు పాక్ లో ఎక్కువవుతున్నాయని జమైత్ ఉలేమా ఈ ఇస్లామ్ (ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ అన్నారు. ఇదొక అంతర్జాతీయ కుట్ర అని... ఇందులో పాక్ ప్రభుత్వం కూడా భాగస్వామి అని ఆరోపించారు. మన చేతకాని పాలనతో కశ్మీరీలకు వెన్నుపోటు పొడిచామని వ్యాఖ్యానించారు. కశ్మీర్ లో వ్యూహాత్మక స్థానాలు మారిపోయాయని చెప్పారు. శ్రీనగర్ ను ఎలా తీసుకోవాలని ఇంత కాలం మనం ఆలోచించామని... ఇప్పుడు ముజఫరాబాద్ (పీవోకే)ను ఎలా కాపాడుకోవాలా? అని ఆందోళన చెందుతున్నామని అన్నారు.
ప్రస్తుతం ఇమ్రాన్ ప్రభుత్వం ఇంటా, బయటా సమస్యలు ఎదుర్కొంటూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలవడంతో పాటు సొంత దేశంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో... దిక్కుతోచని స్థితిలో ఉంది.