Telangana: తెలంగాణలో ‘చర్చలు సఫలం.. ‘ఆరోగ్యశ్రీ’ సేవలు పునరుద్ధరణ
- నెట్ వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఈటల చర్చలు
- బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం
- ప్రతి నెలా ‘ఆరోగ్యశ్రీ’ చెల్లింపులు జరుపుతాం: ఈటల
తెలంగాణలో ఆరోగ్య శ్రీ పథకం సేవలు పునరుద్ధరించేందుకు ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆయా ఆసుపత్రుల ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు చర్చలు జరిపారు. ఆస్పత్రుల ప్రతినిధుల డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించారు. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని, ఇకపై ప్రతి నెలా ‘ఆరోగ్యశ్రీ’ చెల్లింపులు జరుపుతామని, ఆరోగ్య శ్రీ ఎంవోయూ సవరణకు ఓ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణ లో ‘ఆరోగ్యశ్రీ’ సేవలు ఐదు రోజులుగా నిలిచిపోయాయి. చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. ‘ఆరోగ్య శ్రీ’ సేవలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి.