amravathi: 'ఏపీ రాజధానిగా దొనకొండ' అంటూ ప్రచారం.. జోరుగా భూముల కొనుగోళ్లు!
- త్వరలోనే ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని ప్రచారం
- దొనకొండ, పరిసర భూములపై నేతల కళ్లు
- ప్రస్తుతం లక్షల్లో భూముల ధరలు.. అతి త్వరలో కోట్లలోకి?
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధాని వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. కృష్ణానది వరదల కారణంగా ఇటీవల అమరావతిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా, నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఏపీ కొత్త రాజధాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో ముందే దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు కొండెక్కాయి. అక్కడ భూములు కొనేందుకు పెద్ద పెద్ద నేతలు సహా చోటామోటా నాయకులు సైతం రంగంలోకి దిగారు. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో ఇది కోట్లలోకి చేరుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి త్వరలోనే దొనకొండను రాజధానిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, రాజధానిగా అమరావతి అనుకూలం కాదంటున్న ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, సోషల్ మీడియాలో దొనకొండ పేరు హోరెత్తుతుండడంతో చుట్టుపక్కల వారు మాత్రం అక్కడి భూములపై కన్నేశారు.