Andhra Pradesh: అమెరికాలో జగన్ ‘జ్యోతి ప్రజ్వలన’ వివాదం.. బీజేపీ విమర్శలకు వైసీపీ కౌంటర్!
- జగన్ హిందూ సంస్కృతిని అవమానించారన్న బీజేపీ
- అమెరికాలో విద్యుత్ దీపాలే ఉంటాయన్న వైసీపీ
- జగన్ మర్యాదపూర్వకంగా ప్రజ్వలన క్రతువును పూర్తిచేశారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసేందుకు నిరాకరించారని ఏపీ బీజేపీ విభాగం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ ఎన్నికల కోసమే హిందూ ఆలయాలను సందర్శించారనీ, ఏపీలోని హిందువులను మోసం చేశారని ఆరోపించింది. ఈ మేరకు ఏపీ బీజేపీ ఇన్ చార్జీ సునీల్ దేవ్ ధర్, సీఎం రమేశ్ తదితరులు జగన్ తీరును తప్పుపట్టారు. కాగా, ఈ విమర్శలను వైసీపీ ఈరోజు తిప్పికొట్టింది.
బీజేపీ నేతలు, ఏపీ బీజేపీ విభాగం సిగ్గులేకుండా అభ్యంతరకరంగా వ్యవహరిస్తోందని వైసీపీ తెలిపింది. ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. అమెరికా పర్యటన సందర్భంగా జగన్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారనీ, హారతి ఇచ్చారనీ, కుంకుమ తిలకం దిద్దారని వైపీపీ గుర్తుచేసింది.
ఇక ఫైర్ సేఫ్టీ కోడ్ కారణంగా అమెరికాలోని దీపాలన్నీ విద్యుత్ తో రూపొందించారని వైసీపీ తెలిపింది. జగన్ కొత్తగా వెలిగించడానికి అక్కడ ఆయిల్ దీపాలు లేవని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా విద్యుత్ దీపం దగ్గరకు వెళ్లిన జగన్.. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పూర్తిచేశారని పేర్కొంది. ఇందులో హిందూ సంస్కృతిని అగౌరవపర్చడం ఏముందని ప్రశ్నించింది. ఈ మేరకు వైసీపీ ట్విట్టర్ లో స్పందించింది.