Amaravathi: బొత్స వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి.. సీఎం జగన్ వివరణ ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ డిమాండ్
- రాజధానిని మార్చడమంటే పిచ్చి తుగ్లక్ నిర్ణయమే
- బొత్స వ్యాఖ్యలతో ప్రజలకు అనుమానాలు తలెత్తాయి
- రాజధానిలో వరద వచ్చిన దాఖలాలు లేవు
రాజధానిని అమరావతి నుంచి మార్చడమంటే పిచ్చి తుగ్లక్ నిర్ణయమే అవుతుందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న మంత్రి బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, రాజధాని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాల్సిందిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. రాజధానిలో వరద వచ్చిందని చెబుతున్నారని, ఇక్కడ పరిశీలిస్తే ఆ దాఖలాలు లేవని అన్నారు.
చరిత్రలో మహమ్మద్ బీన్ తుగ్లక్ గురించి మనం తెలుసుకున్నామని, ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు.. దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాడని పుస్తకాల్లో చదువుకున్నామని అన్నారు. చాలా మంది ఆయన్ని ‘పిచ్చోడు’ అన్నారని, కొంతమంది ‘మేధావి’ అని అన్నారని, ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఆయన మాదిరి మేధావి కాదు, తుగ్లక్ లా పిచ్చిపనులు చేస్తాడని తాను అనుకోవట్లేదని అన్నారు. సీఎం జగన్ అమెరికా పర్యటనలో ఉంటే బొత్స ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అనుమానాలు తలెత్తాయని అన్నారు. బొత్స వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, సీఎం జగన్ దీనిపై వివరణ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.