Pakistan: పాక్ ఎపిసోడ్ తరువాత... తొలిసారి యుద్ధ విమానాన్ని నడిపిన అభినందన్!
- ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దాడి
- పాక్ విమానాన్ని కూల్చివేసిన అభినందన్
- ఆపై పాక్ కు చిక్కినా మొక్కవోని ధైర్యం
భారత వాయుసేన వింగ్ కమాండర్, సరిహద్దులకు ఆవల పాకిస్థాన్ కు పట్టుబడి, ఆపై అంతర్జాతీయ ఒత్తిడి ఫలితంగా తిరిగి వచ్చిన అభినందన్ వర్ధమాన్, యుద్ధ విమానాన్ని మళ్లీ ఎక్కాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ తో జరిగిన యుద్ధంలో వర్ధమాన్ నడుపుతున్న మిగ్–21 కూలిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు వర్ధమాన్ పాక్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చారు.
తాను పాక్ భూభాగంలో పడిపోయి, శత్రు సేనలకు చిక్కినా ఎంతో ధైర్యం ప్రదర్శించి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారు. పాక్ నుంచి వచ్చాక భద్రతా సంస్థల పర్యవేక్షణలో ఉన్న అభినందన్ కు బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిగాయి. తిరిగి విమానం నడిపేందుకు అభినందన్ ఫిట్ గా ఉన్నాడని వైద్యులు స్పష్టం చేయడంతో, రాజస్థాన్ లోని వైమానిక స్థావరంలో అభినందన్ యుద్ధ విమానం ఎక్కారు. కాగా, కేంద్రం ఇటీవల ఆయనకు వీరచక్ర పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.