bihar: బీహార్ మాజీ ముఖ్యమంత్రి అంత్యక్రియల్లో అవమానం.. గౌరవ సూచకంగా ఒక్క తుపాకీ పేలని వైనం!
- ఈ నెల 19న కన్నుమూసిన జగన్నాథ్ మిశ్రా
- బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు
- మొరాయించిన తుపాకులు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా అంత్యక్రియల్లో అవమానం జరిగింది. ఈ నెల 19న కన్నుమూసిన మిశ్రాకు ఆయన స్వగ్రామమైన బీహార్లోని బలువాలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. అయితే, అంత్యక్రియలకు ముందు పోలీసులు ఆయనకు గౌరవంగా గాలిలోకి తుపాకులు పేల్చాల్చి ఉంది. ఇందుకోసం 22 మంది పోలీసులు సన్నద్ధమయ్యారు.
అయితే, విచిత్రంగా ఏ ఒక్క తుపాకీ కూడా పేలకపోవడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. పోలీసులు, అధికారులు తుపాకులను పరీక్షించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అంత్యక్రియల్లో కాసేపు గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సమక్షంలోనే ఇలా జరగడం గమనార్హం. తుపాకులు పనిచేయకపోవడం అనేది చాలా తీవ్రమైన తప్పిదమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జిల్లా పోలీసు అధికారుల నుంచి వివరణ కోరినట్టు ఆయన పేర్కొన్నారు.