Idrani mukharjee: ఇంద్రాణీ ముఖర్జీ నుంచి 'చిదంబర' రహస్యం రాబట్టిన సీబీఐ!
- ఐఎన్ఎక్స్ కేసు మలుపులో ఆమె కీలకం
- అప్రూవర్‌గా మారి ఈడీ ముందు వెల్లడించిన మనీల్యాండరింగ్ లోగుట్టు
- కేసులో ఆధారాల చిట్టా సాధించిన ఈడీ
అధికారంలో ఉన్నప్పుడు వేసిన ఏ ‘తప్పు’టడుగైనా జీవితాంతం వెన్నంటే ఉంటుందనేందుకు అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదరంబరం ఉదంతం ఓ ఉదాహరణ. అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చిదంబరం అధికారంలో ఉండగా కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. అటువంటి ఆయన ఓ మహిళ లాబీయింగ్ ఉచ్చులో చిక్కుకుని ఇప్పటి పరిస్థితి తెచ్చుకున్నారంటారు. ఆమె పేరు ఇంద్రాణీ ముఖర్జీ. చిదంబరంతోపాటు కేసులో సహనిందితురాలైన ఆమె సీబీఐ ముందు నోరు విప్పి మొత్తం మనీల్యాండరింగ్ లోగుట్టు చిట్టా విప్పడంతోనే చిదంబరానికి కనీసం బెయిలు దొరికే అవకాశం కూడా లేకుండా పోయిందంటున్నారు.
వివరాల్లోకి వెళితే...ఐఎన్ఎక్స్ కేసును గమనిస్తున్న వారికి ఇంద్రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ కేసు తర్వాత ఆమె పేరు దేశమంతా మార్మోగింది. తన కూతురు షీనా బోరా పేరిట భారీ మొత్తంలో సొమ్మును విదేశాల్లో దాచిపెట్టిన ఇంద్రాణీ పరిస్థితులు వికటించడంతో మొదటి భర్త సాయంతో సొంత కూతురినే దారుణంగా కడతేర్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ. తాజాగా చిదంబరం చుట్టూ ఈడీ వల బిగుసుకోవడానికి ఇంద్రాణీయే కారణం.
ఐఎన్ఎక్స్ మీడియా స్కాంలో ఇంద్రాణీ, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీ సహ నిందితులు. ఆ మీడియా సంస్థ స్థాపకులు వీరే. చిదంబరం కుమారుడు కార్తి, పీటర్ కు వ్యాపార సలహాదారుడు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండడం, కార్తి తమకు సలహాదారుడు కావడంతో ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణీ చక్రం తిప్పింది. ఐఎన్ఎక్స్లో 26 శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరుతూ ఎఫ్ఐపీబీకి దరఖాస్తు చేసింది. కానీ ఆమె దరఖాస్తును ఎఫ్ఐపీబీ తిరస్కరించింది.
చిదంబరం కూడా రూ 4.62 కోట్లరూపాయల వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు. ఈ సమయంలో కార్తితో ఇంద్రాణీ వ్యవహారం నడిపించేందుకు స్కెచ్ వేసింది. దీంతో కార్తి ఆమెతో బేరానికి దిగాడు. ‘విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఆమె డీల్ ఓకే చేయిస్తాననడంతో ఇంద్రాణీ, పీటర్ ఒప్పుకున్నారు. దీంతో మనీ లాండరింగ్ ద్వారా దాదాపు రూ. 300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
తర్వాత కార్తిని, ఇంద్రాణీ ఓ స్టార్ హోటల్లో కలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 10 లక్షల డాలర్ల చెల్లింపులకు చర్చలు జరగ్గా రూ 3.5 కోట్ల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత కార్తి చిదంబరానికి సింగపూర్‌లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్‌కు ఈ మొత్తాన్ని ఇంద్రాణీ బదలాయించారు. ఈ కేసులో అరెస్టయ్యాక ఇంద్రాణీ అప్రూవర్‌గా మారి ఈ వివరాలన్నింటినీ బయట పెట్టేయడంతో చిదంబరం, ఆయన కుమారుడు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
ఈ వ్యవహారంలో చిదంబరం పాత్రను, ఆయనతో తాను భేటీ అయిన తేదీలను ఇంద్రాణీ తేదీలు సహా వివరించడంతో వాటినే ఈడీ అధికారులు కోర్టు ముందుంచినట్టు సమాచారం. అందుకే కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదని తెలుస్తోంది.