RBI: ఆర్బీఐ ప్రముఖుల ప్రసంగాలు విని డిక్షనరీల్లో అర్థాలు వెతుక్కున్న ఆర్థిక నిపుణులు!
- అరుదైన పదాలు వాడిన ఆర్బీఐ గవర్నర్, ఎంపీసీ సభ్యుడు
- 'ఫ్లోక్సినాసినిహిలిపిలిఫికేషన్' అంటూ చేతన్ ఘటే పదప్రయోగం
- 'పంగ్లోస్సియాన్' అంటూ పలికిన శక్తికాంత దాస్
భారత్ లో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ప్రతివారం ఆర్బీఐ సమీక్ష చేస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి సమీక్ష సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ద్రవ్య విధాన కమిటీ సభ్యుడు చేతన్ ఘటే ప్రసంగించారు. వారి ప్రసంగంలో ఎంతో అరుదైన, సంక్లిష్టమైన పదాలు దొర్లాయి. ముఖ్యంగా, ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు చేతన్ ఘటే మాట్లాడుతూ, ఫ్లోక్సినాసినిహిలిపిలిఫికేషన్ (floccinaucinihilipilication) అనే పదాన్ని వాడారు. ఆ పదానికి అర్థమేంటో తెలియక ఇతర సభ్యులు వెంటనే గూగుల్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలను ఆశ్రయించాల్సి వచ్చింది.
ఇంతకీ 'ఫ్లోక్సినాసినిహిలిపిలిఫికేషన్' అంటే 'దేనినైనా వ్యర్థమైనదిగా అంచనా వేసే అలవాటు' అనే అర్థం వస్తుందని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ చెబుతోంది. ఇది 18వ శతాబ్దం నాటి పదం.
ఇక, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇలాంటి కఠిన పదప్రయోగమే చేశారు. ఆయన 'పంగ్లోస్సియాన్' అనే పదాన్ని పలికారు. ఈ పదం కూడా ఆర్బీఐ సభ్యులకు అర్థంకాలేదు. వాస్తవానికి 'పంగ్లోస్సియాన్' అనేది ఓ వ్యక్తి పేరు మీద వచ్చింది. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టెయిర్ రాసిన ఓ గ్రంథంలో 'ప్రొఫెసర్ పంగ్లోస్' అనే పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పేరుమీద అత్యంత తీవ్ర ఆశావాదాన్ని సూచించే క్రమంలో 'పంగ్లోస్సియాన్' స్వభావం అని ఆంగ్ల భాషలో వినియోగిస్తుంటారు.