Team India: తొలి టెస్టులో టాస్ గెలిచిన విండీస్... కష్టాల్లో టీమిండియా
- 25 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న భారత్
- 2 వికెట్లు తీసిన రోచ్
- 9 పరుగులు చేసి పెవిలియన్ దారిపట్టిన కోహ్లీ
వెస్టిండీస్ తో తొలి టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. నార్త్ సౌండ్ లో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ లో ఆతిథ్య విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పై పచ్చిక ఉండడంతో విండీస్ బౌలర్లు విజృంభించారు. దాంతో భారత్ 25 పరుగులకే 3 కీలకమైన వికెట్లు చేజార్చుకుంది. కరీబియన్ బౌలర్లలో ముఖ్యంగా కీమార్ రోచ్ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా టాపార్డర్ కు పరీక్ష పెట్టాడు.
మొదట ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5)ను ఓ అద్భుతమైన బంతితో అవుట్ చేసిన రోచ్, ఆ తర్వాత చటేశ్వర్ పుజారా (2)ను సైతం అలాంటి బంతితోనే బోల్తా కొట్టించాడు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం నిరాశపరిచాడు. కోహ్లీ 9 పరుగులే చేసి షానన్ గాబ్రియల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (11 బ్యాటింగ్), అజింక్యా రహానే (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఈ మ్యాచ్ లో తెలుగుతేజం హనుమవిహారికి తుదిజట్టులో స్థానం లభించింది.