america: పౌరసత్వం అంశంలో మరో సంచలన నిర్ణయం దిశగా ట్రంప్!
- జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేసే యోచన
- లక్షలాది కుటుంబాల్లో ఆందోళన
- రాజ్యాంగంలోని 14వ సవరణ దుర్వినియోగం అవుతోందన్న ట్రంప్
మరో సంచలన నిర్ణయం దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులు వేస్తున్నారు. అమెరికా గడ్డపై పుట్టిన వెంటనే సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని యోచిస్తున్నారు. ఈ నిర్ణయం కనుక అమలైతే అమెరికాలో పుట్టే ఇతర దేశాల చిన్నారులకు పౌరసత్వం లభించదు. దీంతో లక్షలాది కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. సరిహద్దులు దాటి వచ్చి అమెరికాలో బిడ్డలకు జన్మనిస్తుండడంతో వారికి ఇక్కడి పౌరసత్వం లభిస్తోందని, ఇది హాస్యాస్పదమని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, పిల్లలకు జన్మతః సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేసే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ట్రంప్ చెప్పడంతో వలస కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా అమెరికా గడ్డపై జన్మించిన వారందరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అయితే, వలసదారులు దీనిని దొడ్డిదారిన ఉపయోగించుకుని పౌరసత్వం పొందుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అందుకనే ఇప్పుడీ జన్మతః లభించే పౌరసత్వాన్ని ఎత్తివేయాలని ట్రంప్ నిర్ణయించారు.