Andhra Pradesh: లంక గ్రామాల్లో హృదయ విదారక సంఘటనలు నెలకొన్నాయి: చంద్రబాబునాయుడు
- కృష్ణానది వరదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- వరదనీటి నిర్వహణ చేయడం ప్రభుత్వానికి చేతకాలేదు
- ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్న సమయంలో వచ్చిన వరదలు ఇవి!
కృష్ణానది వరదలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 19 గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించానని, ప్రతి లంక గ్రామంలో హృదయ విదారక సంఘటనలే నెలకొన్నాయని అన్నారు. సీడబ్య్యూసీ లెక్కల వివరాలు పూర్తిగా ఉన్నాయని, వరదనీరు ఆల్మట్టి నుంచి నారాయణపూర్ కు రావాలంటే 12 గంటలు, నారాయణపూర్ నుంచి జూరాలకు చేరేందుకు 30 గంటలు, జూరాల నుంచి శ్రీశైలానికి వచ్చేందుకు 30 గంటలు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రావాలంటే 12 గంటలు, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ కు చేరేందుకు 24 గంటల సమయం పడుతుందని అన్నారు.
వరదనీటి నిర్వహణ చేయడం ప్రభుత్వానికి చేతకాలేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సృష్టించిన విపత్తు ఇది అని ఆరోపించారు. గత నెల 30 నాటికి జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లో 419 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉందని, ఆ సమయానికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్న సమయంలో వచ్చిన వరదలను చాలా జాగ్రత్తగా నియంత్రించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఫ్లడ్ మేనేజ్ మెంట్ చేయలేకపోయిందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.