Priyanka Chopra: ప్రియాంక చోప్రాను తొలగించాలన్న పాక్ కు దిమ్మతిరిగే జవాబిచ్చిన ఐక్యరాజ్యసమితి
- కశ్మీర్ పై భారత్ కు మద్దతుగా ప్రియాంక వ్యాఖ్యలు
- మండిపడుతున్న పాకిస్థాన్
- గుడ్ విల్ అంబాసిడర్ గా ఆమె తగరంటూ ఆగ్రహం
కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి పాక్ కు దిమ్మతిరిగేలా జవాబిచ్చింది. గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిగత అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, తాము ఆందోళన చెందే అంశాలపై నిర్భీతిగా మాట్లాడవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ వెల్లడించారు.
ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా సమర్థంగా వ్యవహరిస్తున్నారని, ఆమె యూనిసెఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటే మాత్రం పరిగణనలోకి తీసుకునేవాళ్లమని గుటెరాస్ స్పష్టం చేశారు. ప్రియాంక చోప్రా భారత ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్నినెలల కిందట సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినప్పుడు కూడా 'జైహింద్' అంటూ ట్వీట్ చేసింది. అప్పటినుంచే ప్రియాంక అంటే పాక్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.