ttd: టీటీడీ నిధులతో తెలుగుదేశం నేతలకు వసతులు... ఢిల్లీలో విజిలెన్స్ తనిఖీలు!
- ధర్మపోరాట దీక్షకు టీటీడీ నిధులు
- తరువాత సర్దుబాటు చేస్తామన్న అధికారులు
- నిధుల వ్యయంపై అధికారుల ఆరా
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు న్యూఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగిన వేళ, ఆ నిరసనకు హాజరైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బును వినియోగించారన్న ఆరోపణలపై అధికారులు విచారణ ప్రారంభించారు. తొలుత ఖర్చు చేస్తే, తరువాత నిధులను సర్దుబాటు చేస్తామని అధికారులు చెప్పినందునే తాము డబ్బులు ఇచ్చినట్టు ఢిల్లీ టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించినట్టు తెలుస్తోంది. టీటీడీ నిధులతో తెలుగుదేశం నేతలకు హోటల్ గదులు బుక్ చేశామని, వారికి వాహనాలు, భోజనాలకు ఖర్చు పెట్టినట్టు అధికారులు చెప్పడంతో తనిఖీలకు వచ్చిన అధికారులు అవాక్కయ్యారు. కాగా, ఢిల్లీ టీటీడీ దేవాలయాల నిధుల్లో అవినీతి జరుగుతోందని గత మూడేళ్లుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 4 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టు ప్రస్తుతం అధికారులు తేల్చారు. ఈ ఆరోపణలపై ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించగా, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి, నిధులు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనని తేల్చారు. ఇదిలావుండగా, తనిఖీలపై ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో టీటీడీ స్థానిక సలహా సంఘం చైర్మన్ పదవికి ప్రవీణ్ ప్రకాశ్ రాజీనామా చేయడం గమనార్హం.