Jammu And Kashmir: కశ్మీర్లో బయటకు అడుగుపెట్టలేకపోతున్నాం : రాహుల్‌గాంధీ ముందు భోరుమన్న మహిళ
- పిల్లలతో బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది
- కశ్మీర్ ఎయిర్ పోర్టులో ఘటన
- ఓదార్చిన కాంగ్రెస్ నేత
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులు అంచనా వేసేందుకు కశ్మీర్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి విచిత్రమైన పరిస్థితి ఎదురయింది. కశ్మీర్లోకి అడుగుపెట్టకుండా రాహుల్ బృందాన్ని అక్కడి అధికారులు వెనక్కి పంపడంతో వారంతా తిరుగు ప్రయాణం కోసం విమానం ఎక్కారు. ఆ సమయంలో ఓ మహిళ రాహుల్ ముందుకు వచ్చి కశ్మీర్లో బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేదని, పిల్లలతో బయటకు వెళ్లాలంటే భయం వేస్తోందంటూ ఒక్కసారిగా భోరుమనడంతో యువనేత ఆశ్చర్యపోయారు. హృద్రోగంతో బాధపడుతున్న తన సోదరుడిని పది రోజుల నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలించలేదంటూ ఆ మహిళ బోరు మనడంతో రాహుల్ చలించిపోయారు.
వెంటనే తన సీటు నుంచి లేచి ఆమెను ఓదార్చారు. అక్కడే ఉన్న పార్టీ నేతలు గులాంనబీ అజాద్, ఆనంద్‌శర్మ, కె.సి.వేణుగోపాల్, ఇతర విపక్ష నేతలు కూడా ఆమె చెప్పేది శ్రద్ధగా విన్నారు. ఈ సంఘటన సందర్భంగా తీసిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాధికా ఖేరా ట్విట్టర్లో పోస్టు చేశారు.