UK: బ్రిటన్ ప్రధాని బోరిస్ పై ప్రశంసలు కురిపించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్!
- ఫ్రాన్స్ లోని పారిస్ లో జీ7 సదస్సు
- సమావేశమైన బ్రిటన్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు
- ఈ ఏడాది అక్టోబర్ లోపు బ్రెగ్జిట్ కు గడువు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తిచేసేందుకు జాన్సన్ అర్హుడని ట్రంప్ కితాబిచ్చారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెగ్జిట్ విషయంలో బోరిస్ జాన్సన్ కు ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈయూ నుంచి విడిపోవాలా? వద్దా? అనే విషయమై 2016, జూన్ 23న బ్రిటన్ లో రెఫరెండం నిర్వహించారు.
దీంట్లో దాదాపు 51.9 శాతం మంది ఓటర్లు ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంతో బ్రిటన్ ప్రధాని థెరీసా మే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నెల రోజుల క్రితం బోరిస్ జాన్సన్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ డీల్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరప్ దేశాల నుంచి బ్రిటన్ కు భారీగా వలసలు జరుగుతున్నాయనీ, తద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని పలువురు బ్రిటిషర్లు నిరసన తెలపడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.