PV Sindhu: తల్లి పుట్టినరోజు నాడే అద్భుతం చేసిన పీవీ సింధు... రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
- వరల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గిన సింధు
- ఫైనల్లో ఒకుహరపై వరుస గేముల్లో విజయం
- అపూర్వం అంటూ యావత్ భారతదేశం మురిసిన వైనం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా పీవీ సింధు చరిత్ర సృష్టించడం తెలిసిందే. సరిగ్గా తన తల్లి విజయ పుట్టినరోజు నాడే సింధు ఈ ఘనత సాధించడం విశేషం అని చెప్పాలి. తాను ఈ స్థాయికి ఎదగడంలో కీలకపాత్ర పోషించిన మాతృమూర్తికి సింధు సరైన కానుక ఇచ్చినట్టయింది. కాగా, సింధు విజయంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యావత్ భారతదేశానికి ఇది గర్వించదగ్గ సమయం అంటూ కోవింద్ పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ కోర్టులో నీ మాయాజాలం, కఠోర శ్రమ కోట్లాది మందిని ఉర్రూతలూగించడమే కాదు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా సింధు ప్రతిభను బ్రహ్మాండం అంటూ అభివర్ణించారు. ఆట పట్ల ఆమె అనురక్తి ప్రశంసనీయం అంటూ కొనియాడారు. తర్వాతి తరాల ఆటగాళ్లకు సింధు విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇవాళ స్విట్జర్లాండ్ లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు 21-7, 21-7తో జపాన్ కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి నజోమీ ఒకుహరపై ఘనవిజయం సాధించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది.