Amit Shah: కేంద్ర హోమ్ మంత్రి సమావేశానికి న్యూఢిల్లీకి బయలుదేరిన వైఎస్ జగన్, కేసీఆర్!
- నేడు అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం సమావేశం
- నక్సలైట్ల సమస్యపై చర్చించనున్న ముఖ్యమంత్రులు
- హాజరుకానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ ఉదయం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీ బయలుదేరారు. నేడు దేశ రాజధానిలో అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం సమావేశం జరుగనుండగా, అందులో వీరు పాల్గొననున్నారు.
వామపక్ష తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాలతో కేంద్ర హోమ్ శాఖ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకూ సమావేశం నిర్వహించనుండగా, ఏఓబీ (ఆంధ్రా ఒడిశా బార్డర్)లో రాష్ట్ర సమస్యపై జగన్ మాట్లాడనున్నారు. ఈ సమావేశానికి నక్సలైట్ల ప్రభావిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానుండగా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వారితో భేటీ కానున్నారు. ఇదే సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేరళ, బెంగాల్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు.