anand mahinra: దేవుడా...ఇమ్రాన్‌ఖాన్‌ని హిస్టరీ లెక్చరర్ చేయనందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానిపై ఆనంద్మహీంద్రా సెటైర్
- పాత వ్యాఖ్యలపై తాజాగా మాటలు జోడించిన పారిశ్రామిక వేత్త
- జర్మనీ, జపాన్‌లు సరిహద్దులు పంచుకుంటున్నాయనడంపై వ్యంగ్యం
- నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న సెటైర్
భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై సెటైర్ పేల్చారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ‘దేవుడా...ఆయనను (ఇమ్రాన్) మాకు హిస్టరీ లెక్చరర్ చేయనందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసి నవ్వులు పూయిస్తున్నారు. నెట్టింట్లో ప్రస్తుతం ఈ వ్యాఖ్య హల్చల్ చేస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 జీవోను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇమ్రాన్ వాచాలత్వం చాలాసార్లు బయటపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇరాన్ పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్‌ఖాన్ అప్పట్లో చెప్పిన ఓ మాటకు తాజాగా ఆనంద్ సెటైర్ జోడించి ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ పర్యటనలో ఇమ్రాన్ ‘సరిహద్దు పంచుకుంటున్న జర్మనీ, జపాన్‌లు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
వాస్తవానికి ఈ రెండు దేశాల సరిహద్దులు కలుసుకోవు. జపాన్ ఆసియాలో వుంటే, జర్మనీ యూరప్ లో వుంది. రెండు దేశాలు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే 'ఆయనను మాకు హిస్టరీ లెక్చరర్ చేయకుండా కాపాడావు దేవుడా' అంటూ ఆనంద్ ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశారు.