amaravathi: కృష్ణా నదిపై ఐకానిక్ వంతెనపట్ల ఏపీ ప్రభుత్వం అనాసక్తి.. సాధారణ వంతెనతో సరిపెడుతున్న ఎన్హెచ్ఏఐ
- టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదన
- అదనపు వ్యయం భరించాలన్న కేంద్రం
- ప్రభుత్వం మారడంతో ప్రతిపాదన వెనక్కి
ఐకానిక్ వంతెన...ఈ పేరు ఎప్పుడో విన్నట్లుంది అనిపిస్తోంది కదూ. నిజమే...జాతీయ రహదారితో ఏపీ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఆరులేన్ల రహదారి ఇది. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అనాసక్తి కారణంగా ఐకానిక్ స్థానంలో సాధారణ వంతెన నిర్మాణానికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) సిద్ధమవుతోంది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా నదిపై గొల్లపూడివద్ద 3.1 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణం ప్రతిపాదించారు. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐకానిక్ వంతెనగా నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. సాధారణ వంతెనకు రూ.400 కోట్ల వ్యయం ఐతే ఐకానిక్కు రూ.800 కోట్లు అవుతుందని, అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని రాష్ట్రానికి సూచించింది. ఈలోగా ప్రభుత్వం మారడం, ప్రజలకు సౌకర్యంగా ఉంటే చాలని, ఐకానిక్ అక్కర్లేదని కొత్త ప్రభుత్వం అభిప్రాయపడడంతో ఎన్హెచ్ఏఐ సాధారణ వంతెన నిర్మాణానికి సిద్ధమవుతోంది.