Rahul Gandhi: కేరళ వరదలపై.. ముగ్గురు కేంద్ర మంత్రులకు రాహుల్ గాంధీ లేఖ!
- వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ
- 125 మంది ప్రాణాలు పోయాయని గుర్తు చేసిన రాహుల్
- వెంటనే కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి
ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ముగ్గురు కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లేఖలు రాశారు. వరదలతో వాయనాడ్ ప్రాంతం మరింత ఎక్కువగా నష్టపోయిందని గుర్తు చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ లకు ఈ మేరకు రాహుల్ విడివిడిగా లేఖలు రాశారు.
దాదాపు నెల రోజుల పాటు వరద బీభత్సం కొనసాగిందని గుర్తు చేసిన రాహుల్, 125 మంది ప్రాణాలు కోల్పోయారని, 16 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, వరుసగా రెండో సంవత్సరం వరదలు ముంచెత్తాయని అన్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ స్కీమ్ కింద ప్రస్తుతమున్న 100 రోజుల ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలని ఆయన సూచించారు.
గడచిన దశాబ్దకాలంలోనే ఇవి అతిపెద్ద వరదలని, దెబ్బతిన్న రహదారులను తిరిగి నిర్మించేందుకు నిధులివ్వాలని కోరారు. వాయనాడ్ ప్రాంతాన్ని నిత్యమూ ఎంతో మంది టూరిస్టులు సందర్శిస్తుంటారని, ప్రస్తుతం ఇక్కడికి పర్యాటకులు రాకపోవడంతో, ప్రజలు ఆదాయ మార్గాలను కోల్పోయారని అన్నారు. 766వ నంబర్ జాతీయ రహదారి 20 ప్రాంతాల్లో కోతకు గురైందని, వెంటనే నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అన్నారు.
వాయనాడ్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున మెడికల్ క్యాంపులను నిర్వహించాలని రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కు విజ్ఞప్తి చేశారు. కాగా, తన సొంత నియోజకవర్గమైన వాయనాడ్ ను రాహుల్ సందర్శించనున్నారు.