cecil wright: 85 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సెసిల్ రైట్!
- 85 ఏళ్ల వయసులో 60 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడిన రైట్
- 7 వేల వికెట్లు సొంతం
- సగటున ప్రతీ 27 బంతులకు ఓ వికెట్
ఒకప్పటి వెస్టిండీస్ పేసర్, ఇంగ్లండ్ ఆటగాడు సెసిల్ రైట్ ఎట్టకేలకు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరికొన్ని రోజుల్లో 85వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. విండీస్ దిగ్గజ ఆటగాళ్లు వివియన్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, జోయెల్ గార్నర్, ఫ్రాంక్ వోరెల్ వంటి దిగ్గజాలతో ఆడిన సెసిల్ 1959లో ఇంగ్లండ్ వెళ్లి లాంక్షైర్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డాడు.
రైట్ తన 85 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లకుపైగా క్రికెట్ ఆడాడు. మొత్తంగా ఏడువేల వికెట్లు పడగొట్టాడు. సగటున ప్రతీ 27 బంతులకు ఓ వికెట్ చొప్పున ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసిన చరిత్ర రైట్ సొంతం. ఇంత సుదీర్ఘకాలం క్రికెట్లో కొనసాగడానికి గల కారణం తనకు మాత్రమే తెలుసని, అది ఎవరికీ చెప్పేది కాదని రైట్ పేర్కొన్నాడు. వచ్చే నెల 7న పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్ జట్టు తరపున ఆడి క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్టు సెసిల్ రైట్ తెలిపాడు.