Botsa Satyanarayana satyanarayana: బీజేపీ నేత సుజనా చౌదరిపై బొత్స సంచలన వ్యాఖ్యలు.. ఆయన భూముల చిట్టా తన వద్ద ఉందన్న మంత్రి
- కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చినా రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలే
- రాజధానిపై చంద్రబాబు విధానమేంటో బయటపెట్టాలి
- రాజధానిలో తప్ప మరెక్కడా భూముల ధరలు పెరగకూడదా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సాయంత్రం అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని బయటకు తీసేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. అందరికీ సమన్యాయం తమ ప్రభుత్వ విధానమన్న బొత్స.. అభివృద్ధి ఆగబోదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చినా అన్నీ తాత్కాలిక భవనాలే తప్ప శాశ్వత నిర్మాణాలు లేవన్నారు. టెండర్ల విషయంలో చంద్రబాబు విధానాలు పాటించలేదని విమర్శించారు.
ప్రస్తుతం విశాఖపట్టణం, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందన్న బొత్స.. రాజధానిలో తప్ప మరెక్కడా భూముల ధరలు పెరగకూడదా? అని ప్రశ్నించారు. అసలు రాజధానిపై చంద్రబాబు విధానమేంటో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ నేత సుజనా చౌదరికి రాజధానిలో ఉన్న భూముల వివరాల మొత్తం చిట్టా తమ వద్ద ఉందని మంత్రి తెలిపారు.
అసలు రాజధానిలో ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయో మొత్తం బయటపెడతామని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. సుజనాకు మొత్తం 120 కంపెనీలు ఉన్నాయన్న బొత్స.. చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఆయన కంపెనీకి 110 ఎకరాలు వున్నాయని, జగ్గయ్యపేటలో 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చిన తర్వాతే ఆ ప్రాంతాన్ని రాజధానిలో కలిపారని బొత్స ఆరోపించారు. యలమంచిలి రుషికన్య పేరుతోనూ సుజనకు భూములు ఉన్నాయని బొత్స ఆరోపించారు.