Sujana Chowdary: జగన్ మంచి వ్యాపారవేత్త.. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు: సుజనా చౌదరి
- రాజధాని మార్పు అంత సులభం కాదు
- అవసరం వచ్చినప్పుడు కేంద్రం దృష్టికి రివర్స్ టెండరింగ్
- మూడు నెలల్లోనే ఇంత దారుణమా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి వ్యాపారవేత్తని, కానీ ఎందుకిలా చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనపై చేసిన ట్వీట్లకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత.. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమన్నారు. అవసరం వచ్చినప్పుడు రివర్స్ టెండరింగ్ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జగన్ మంచి పారిశ్రామికవేత్త అని, ఆయన ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని, అందులో కేంద్రం జోక్యం చేసుకోవాలనుకోవడం లేదన్నారు. అయితే, ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ ఒప్పందాలను ఎలా రద్దు చేస్తారన్నదే ప్రశ్న అని సుజనా అన్నారు. ప్రభుత్వం తన వ్యవహారశైలి మార్చుకోకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా ముందుకు రారన్నారు. జగన్ ఇకనైనా పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. రాజధాని మార్పు అంత తేలికైన విషయం కాదన్నారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని సుజనా చౌదరి మండిపడ్డారు.