Jammu And Kashmir: వందల కోట్ల రూపాయలతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ!
- వచ్చే నెల 31 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్
- అక్టోబరు 31 నుంచి పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి
- విద్యాహక్కు చట్టం అమలుకు కోట్లాది రూపాయల కేటాయింపు?
వందల కోట్ల రూపాయలతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. వచ్చే నెల 31 నుంచి జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది. అక్టోబరు 31 నుంచి రాష్ట్రం పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పలు అంశాలపై చర్చించారు.
జమ్మూ కశ్మీర్లో ఓ ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర కార్మికశాఖ అందించింది. విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు కోట్లాది రూపాయలు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలను దగ్గర చేసేందుకు ఆధార్ చట్టం -2016 అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర చట్టాలను అక్కడ అమలు చేసే విషయంపైనా సమీక్షించారు. దీంతోపాటు వివిధ శాఖలు అందించిన ప్రతిపాదనలు అమలు చేసేందుకు ఎంతమొత్తం అవసరమవుతుందన్న దానిపై మదింపు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.