Pakistan: పాకిస్థాన్ లేఖలో రాహుల్ పేరు మాత్రమే కాదు.. బీజేపీ ముఖ్యమంత్రి పేరు కూడా!
- సీఎం మనోహర్ ఖట్టర్, ఎమ్మెల్యే విక్రమ్ శైనీల పేర్లను లాగిన పాక్
- కశ్మీరీ యువతులపై వారి వ్యాఖ్యలను ఉటంకించిన వైనం
- లింగత్వాన్ని కూడా అస్త్రంగా వాడుకుంటున్నారని వ్యాఖ్య
ఐక్యరాజ్యసమితికి భారత్ కు వ్యతిరేకంగా రాసిన లేఖలో కేవలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును మాత్రమే పాకిస్థాన్ వాడుకోలేదు. బీజేపీని కూడా వివాదంలోకి లాగింది. హర్యాణా బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ శైనీల పేర్లను కూడా వాడుకుంది. కశ్మీరీ మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలను లేఖలో పేర్కొంది.
లింగత్వాన్ని కూడా అస్త్రంగా బీజేపీ నేతలు వాడుకుంటున్నారని లేఖలో పాకిస్థాన్ తెలిపింది. జమ్ముకశ్మీర్ లో మారిన పరిణామాల నేపథ్యంలో, పార్టీలోని బీజేపీ వర్కర్లు సంతోషించాల్సిన విషయం ఏమిటంటే... ఇప్పుడు మీరంతా తెల్లగా ఉండే కశ్మీరీ యువతులను పెళ్లి చేసుకోవచ్చు అని సైనీ చేసిన వ్యాఖ్యలను పాక్ ఉటంకించింది.
ఇప్పుడు కశ్మీర్ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. పెళ్లికూతుళ్లను అక్కడి నుంచి తెచ్చుకుంటామని కొందరు చెబుతున్నారని మనోహర్ ఖట్టర్ పేర్కొన్నారని పాక్ తెలిపింది.