Polavaram: రాష్ట్రంలో సీఎం జగన్ పాలన ‘రివర్స్’లో నడుస్తోంది: టీడీపీ నేత రామానాయుడు
- ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు తొలగింపు కరెక్టు కాదు
- అవార్డులు సాధించిన అధికారులు జగన్ కు నచ్చరు
- సమర్థవంతులైన ఇంజనీర్లను తొలగిస్తున్నారు!
రాష్ట్రంలో సీఎం జగన్ పాలన ‘రివర్స్’లో నడుస్తోందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావును తొలగించడంపై ఆయన నిప్పులు చెరిగారు. అవార్డులు సాధించిన అధికారులు సీఎం జగన్ కు నచ్చరని, పైరవీలకు ఉపయోగపడే అధికారులే ఆయనకు కావాలని విమర్శించారు. సమర్థవంతులైన ఇంజనీర్లను తొలగిస్తున్నారని, ఇష్టారాజ్యంగా మార్పులు చేస్తే ప్రాజెక్టు భద్రతకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
‘పోలవరం’ అంటే ‘వెంకటేశ్వరరావు' అని, ‘వెంకటేశ్వరరావు’ అంటే ‘పోలవరం’ అని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టుకు వెంకటేశ్వరరావు చేస్తున్న సేవలు ఈనాటివి కావని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పటి నుంచి ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. రీ-టెండరింగ్ పేరుతో తమకు ఇష్టమైన కాంట్రాక్టర్లను నియమించుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి వెంకటేశ్వరరావు అడ్డుగా ఉన్నారని భావించి ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించారా? అని సీఎం జగన్ ని ప్రశ్నించారు. నవయుగ, ఎల్ అండ్ టీ, త్రివేణి వంటి సంస్థలకు చెందిన కాంట్రాక్టుదారులను తొలగించారని విమర్శించారు.