India: జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అమెరికా ఆందోళన
- కశ్మీర్ ప్రజలపై ఆంక్షలపై అమెరికా ఆందోళన
- మానవహక్కులను గౌరవించాలని సూచన
- కశ్మీర్ సమస్యను ఇరు దేశాలే పరిష్కరించుకోవాలని స్పష్టీకరణ
జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశం భారత్-పాకిస్థాన్‌ల ద్వైపాక్షిక అంశమేనని స్పష్టం చేసిన అమెరికా.. పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ సంయమనం పాటించాలని హెచ్చరించింది. జమ్మూకశ్మీర్ ప్రజలపై కొనసాగుతున్న ఆంక్షలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆంక్షల వల్ల ప్రభావితం అవుతున్న అక్కడి ప్రజలతో మాట్లాడి మానవహక్కులను గౌరవించాలని అమెరికా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కశ్మీర్లో తిరిగి సాధారణ రాజకీయ పరిస్థితులు తీసుకువస్తామన్న భారత ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
కాగా, మూడు రోజుల క్రితం భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో సమావేశమై జమ్మూకశ్మీర్ అంశంపై మాట్లాడారు. 1947కు ముందు పాకిస్థాన్ భారత భూభాగంలోనే ఉంది కాబట్టి కశ్మీర్ అంశం ద్వైపాక్షికమేనని, ఈ సమస్య పరిష్కారానికి మూడో దేశం జోక్యం అవసరం లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.