Jagan: మూడు దశల్లో వాటర్ గ్రిడ్ పనులు... అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
- వాటర్ గ్రిడ్ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం
- ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలంటూ స్పష్టీకరణ
- కిడ్నీ వ్యాధుల ప్రాబల్య ప్రాంతాల్లో నేరుగా ప్రజల ఇళ్లకే శుద్ధి చేసిన తాగునీరు సరఫరా!
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ వాటర్ గ్రిడ్ పథకంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటర్ గ్రిడ్ పథకం మూడు దశల్లో చేపట్టాలని, మొదటి దశలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాలు, రెండో దశలో విజయనగరం, విశాఖ, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నీటి లభ్యత ఉన్న ప్రదేశంలోనే శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేయాలని, ఉద్దానం వంటి కిడ్నీ వ్యాధుల ప్రాబల్య ప్రాంతాల్లో నీటి శుద్ధి కేంద్రాల నుంచే నేరుగా ఇళ్లకు మంచి నీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ స్టోరేజి ట్యాంకులు, మంచినీటి చెరువుల్లో తాగునీటిని నింపిన తర్వాత వాటిలో నీరు పాడవకుండా తగిన చర్యలు తీసుకోవడంపైనా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.