Purandeswari: రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి: పురందేశ్వరి
- పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపించడంలేదు
- రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే
- సీఎం జగన్ రాజధానిపై స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్
ఏపీలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు. కడపలో ఆమె మాట్లాడుతూ, పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సమీక్షతో రాష్ట్రానికి పెట్టుబడలు వచ్చే అవకాశం కనిపించడంలేదని విమర్శించారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ తక్షణమే రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీపైనా ఆమె విమర్శలు చేశారు. బీజేపీకి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ చివరికి సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. వయోభారంతో ఉన్న సోనియా గాంధీని అధ్యక్షురాలిగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.