cyber crime: ట్విట్టర్ సీఈఓకు షాక్.. ఏకంగా ఆయన ఖాతానే హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు!
- జాక్ డోర్సీ ఖాతాను దాదాపు 15 నిమిషాలు గుప్పెట్లో పెట్టుకున్న హ్యాకర్లు
- అనుచితమైన సందేశాలు పోస్టింగ్
- పసిగట్టి రంగంలోకి దిగిన నిపుణుల బృందం
సైబర్ నేరగాళ్లకు వారూ, వీరూ అన్న తేడాలేకుండా ఉంది. హ్యాకర్లు ఎంతలా రెచ్చిపోతున్నారనేందుకు ఉదాహరణ సాక్షాత్తు ట్విట్టర్ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఖాతా హ్యాకింగే! గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఆయన ఖాతాను హ్యాక్ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు తమ అధీనంలో ఖాతా ఉంచుకుని జాత్యహంకార, దేశ విద్రోహ వ్యాఖ్యలున్న అనుచిత సందేశాలు పంపారు.
దీన్ని పసిగట్టిన సంస్థ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఖాతాను హ్యాకర్ల ముప్పు నుంచి కాపాడారు. దుండగులు పోస్ట్ చేసిన అనుచిత సందేశాలను తొలగించారు.అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ చీఫ్ ఖాతానే కాపాడలేనప్పుడు మిగిలిన యూజర్ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో అసలు డోర్సీ ట్విటర్ ఖాతా ఎలా హ్యాక్ అయింది? భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ట్విట్టర్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.