Andhra Pradesh: ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ... పీపీఏల రద్దుపై విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ కీలక ఆదేశాలు
- పీపీఏలు రద్దు చేయాల్సిన అవసరంలేదన్న ట్రైబ్యునల్
- సమీక్ష నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ సర్కారుకు ఆదేశాలు
- పీపీఏలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన పనిలేదంటూ వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చిన కొన్నివారాలకే ఏపీ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడం తెలిసిందే. వాటిలో పీపీఏల (విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు) రద్దు నిర్ణయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. కేంద్రం కూడా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, పీపీఏల రద్దుపై విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి ఆదేశాలు జారీ చేసింది. పీపీఏల రద్దు, వాటిపై సమీక్షించాలన్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. పీపీఏలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కొనసాగించాలంటూ తేల్చి చెప్పింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలను సమీక్షించాలని జగన్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, సౌర, పవన్ విద్యుత్ సంస్థలకు నోటీసులు కూడా పంపారు. దాంతో, ఆయా కంపెనీలు విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. గత రెండు నెలల నుంచి వాదోపవాదాలు జరుగుతుండగా, నేడు అప్పిలేట్ ట్రైబ్యునల్ పీపీఏలు రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.