westindies: హనుమ విహారి సెంచరీ.. బుమ్రా హ్యాట్రిక్.. కుప్పకూలిన విండీస్
- టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన హనుమ విహారి
- 16 ఏళ్ల తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన బుమ్రా
- 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్
విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. 264/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 416 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు తొలి బంతికే రిషభ్ పంత్ (27) పెవిలియన్ చేరాడు. అయితే, క్రీజులో కూరుకుపోయిన హనుమ విహారి ఇషాంత్ శర్మతో కలిసి జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 225 బంతులు ఆడిన విహారి 16 ఫోర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. టెస్టుల్లో విహారికి ఇది తొలి సెంచరీ. మరోవైపు, ఇషాంత్ కూడా అర్ధ సెంచరీ (57) చేశాడు. అయితే, ఇషాంత్ అవుటైన కాసేపటికే ఇన్నింగ్స్ కుప్పకూలింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను బుమ్రా హ్యాట్రిక్‌తో వణికించాడు. తొమ్మిదో ఓవర్లో వరుసగా డారెన్ బ్రావో (4), బ్రూక్స్ (0), రోస్టన్ చేజ్ (0)లను వెనక్కి పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫలితంగా 16 ఏళ్ల తర్వాత భారత్ తరపున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన ఆటగాడిగా బుమ్రా రికార్డులకెక్కాడు. మొత్తం 9.1 ఓవర్లు వేసిన బుమ్రా 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచాడు. బుమ్రా దెబ్బకు విండీస్ పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసి భారత్ కంటే 329 పరుగులు వెనకబడి ఉంది.