Sharad pawar: ఆర్టికల్ 370 రద్దుపై తొలుత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి: రాహుల్, శరద్ పవార్‌కు అమిత్ షా సూటి ప్రశ్న
- త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
- ఆర్టికల్ 370, 35ఎ రద్దు తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికలు
- ఎన్నికలకు ముందే తమ వైఖరేంటో చెప్పాలని నిలదీత
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్లను సూటిగా ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆర్టికల్ 370, 35ఎ రద్దుపై వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్ సమర్పించిన నివేదికలో రాహుల్ గాంధీ పేరును ఉపయోగించడం కాంగ్రెస్‌కు సిగ్గు చేటన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవిస్తో కలిసి ‘మహాజన్దేశ్’ యాత్ర ర్యాలీలో పాల్గొన్న షా మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, 35ఎ రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనన్నారు. కాబట్టి ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ, శరద్ పవార్లు వీటిపై తమ కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాలని అమిత్ షా డిమాండ్ చేశారు.