Pakistan: ఉగ్రవాదుల్ని అరికట్టాలంటే ఆంక్షలు తప్పవు: విదేశాంగ మంత్రి జైశంకర్
- ముష్కరులు, వారి నేతలకు మధ్య బంధం ఇదే కదా
- దీన్ని నియంత్రించేందుకు ఇంకో మార్గం ఏముంది?
- కశ్మీర్ ప్రజలు మరికొన్ని రోజులు ఇబ్బంది పడక తప్పదు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, వారి నాయకుల మధ్య ప్రధాన అనుసంధాన కర్తలు మొబైల్, ఇంటర్నెట్ సేవలేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. వాటిని అరికట్టాలంటే కొన్నాళ్లపాటు ఆంక్షలు తప్పవని అన్నారు. సమాచార సేవల్ని నిలిపివేసి కశ్మీర్ ప్రజల్ని భారత్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్న పాకిస్థాన్ ఆరోపణలకు శుక్రవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రి దీటైన జవాబు ఇచ్చారు.
ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు ఎత్తివేస్తే అది ఉగ్రవాదులకు కలిసి వస్తుందన్నారు. ఉగ్రవాదులు వారి నాయకులతో మాట్లాడకుండా మరో మార్గంలో ఎలా నిరోధించగలమని ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చల విషయాన్ని జైశంకర్ కొట్టిపారేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడం మానుకోనన్నాళ్లు ఆ దేశంతో చర్చల ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై పాకిస్థాన్ విషం చిమ్ముతూనే ఉంది. అందులో భాగంగా సమాచార వ్యవస్థని నిలిపివేశారంటూ ఆరోపించింది.