Chota Don: కశ్మీర్ లో పట్టుబడిన 13 ఏళ్ల 'చోటా డాన్'!
- 10 ఏళ్లకే రాళ్లు పట్టిన బాలుడు
- సంఘ విద్రోహుల చేతిలో పావుగా మారాడు
- వెల్లడించిన ఎస్పీ సందీప్ చౌదరి
జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో 'చోటా డాన్' గా పేరు తెచ్చుకున్న 13 సంవత్సరాల బాల నిరసనకారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 సంవత్సరాలకే నిరసనకారులతో చేరి, సైన్యంపై రాళ్లు విసిరిన ఘటనల్లో పాల్గొన్న బాలుడిని ప్రస్తుతం జువైనల్ హోమ్ కు తరలించామని అధికారులు తెలిపారు. ఇటీవల షోపియాన్ లో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు వెళుతున్న వేళ, వారిపై రాళ్లు విసిరిన కేసులో ఇతన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
అతన్ని అరెస్ట్ చేసిన సమయంలో పెద్ద కర్రతో ఉన్నాడని, రాష్ట్రంలో అలజడులను సృష్టించాలని భావిస్తున్న వారి చేతిలో ఇతను పావుగా మారాడని సోఫియాన్ సీనియర్ ఎస్పీ సందీప్ చౌదరి వెల్లడించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎటువంటి వారిపైనైనా కఠినంగానే వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ బాలుడి క్షేమం కోరే, పేరును బయట పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. 2016 నుంచి ఈ ప్రాంతంలో సదరు బాలుడు అందరికీ పరిచయస్తుడని, రాళ్లు బలంగా విసరడంలో నేర్పరని అన్నారు. కాశ్మీర్ సమస్య గురించిగానీ, ఆర్టికల్ 370 గురించిగానీ అతనికి ఎటువంటి సమాచారమూ తెలియదని విచారణలో వెల్లడైందన్నారు.