Andhra Pradesh: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు బిగిసిన ఉచ్చు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్!
- చింతమనేనిపై జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు
- కులం పేరుతో దూషించి కొట్టాడని కేసు
- మఫ్టీలో తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. చింతమనేని తనను కులం పేరుతో దూషించాడనీ, దాడికి పాల్పడ్డాడని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేని ముందుజాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జోసెఫ్ ఫిర్యాదు నేపథ్యంలో చింతమనేనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు గాలింపును ముమ్మరం చేశారు. దుగ్గిరాలలోని చింతమనేని నివాసంతో పాటు ఏలూరు కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మఫ్టీలో మోహరించారు.
అలాగే ఏలూరులో ఈరోజు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో అక్కడికి కూడా పోలీసులు మఫ్టీలో చేరుకున్నారు. చింతమనేని ప్రభాకర్ బెయిల్ కోసం బయటకు వస్తే వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. దీంతో ఏ క్షణంలో అయినా చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.