KCR: హరీశ్‌రావు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు: విజయశాంతి
- జనం సమస్యలతో బాధపడుతుంటే వీరు పదవుల కోసం కొట్టాడుకుంటున్నారు
- జీహెచ్ఎంసీ ఇంకా కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తోంది
- ప్రజల జీవితాలతో కేసీఆర్ అండ్ కో ఆడుకుంటున్నారు
తెలంగాణ ప్రజలు ఓవైపు సమస్యలతో అల్లాడిపోతుంటే గులాబీ జెండాలకు తామే బాస్‌లమని ఓ వర్గం.. సీఎం కావాలని మరో వర్గం వాదులాడుకుంటూ, ప్రయత్నాలు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధుల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారిని పట్టించుకోవాల్సింది పోయి.. ఆ సమస్యలను బూచిగా చూపి మంత్రి ఈటలను బలిపశువును చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని స్వయంగా ఈటల తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు వార్తలు వచ్చాయన్నారు.
జీహెచ్ఎంసీ, మునిసిపల్ వ్యవస్థలు ఇప్పటికీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రం వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మాజీ మంత్రి హరీశ్‌రావు మాత్రం సందట్లో సడేమియాలా ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం అనుచరులతో కొబ్బరికాయలు కొట్టిస్తూ చాపకింద నీరులా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన ‘కేసీఆర్ అండ్ కో’ అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు.