Jagan: రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు: ఉండవల్లి శ్రీదేవి ఘటనపై జగన్ స్పందన
- వినాయకచవితి సందర్భంగా టీడీపీ నేతలు తనను దూషించారంటూ ఉండవల్లి శ్రీదేవి ఆరోపణ
- ఘటనపై ఆరా తీసిన సీఎం జగన్
- కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రి సుచరితకు ఆదేశాలు
వినాయకచవితి సందర్భంగా టీడీపీ నేతలు తనను కులం పేరిట దూషించారని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రస్థాయిలో కలకలం రేపింది. దీనిపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఉండవల్లి శ్రీదేవిని అడిగి పూర్వాపరాలు కనుక్కున్నారు. తనను తీవ్రంగా దూషించారంటూ శ్రీదేవి సీఎంకు వివరించారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన జగన్, రాష్ట్రంలో మహిళలు ఎవరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. మహిళలు ఏ పార్టీకి చెందిన వారైనా, ఇలాంటి అవమానం జరగడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, బాధపడవద్దంటూ ఉండవల్లి శ్రీదేవికి ధైర్యం చెప్పారు. ఘటనలో బాధ్యులెవరూ తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రి మేకతోటి సుచరితను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళల పట్ల అవమానకర ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.