Telangana: కవితను ఓడించారన్న కక్షతో రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్
- రాష్ట్రంలో యూరియా కొరతకు ప్రభుత్వమే కారణం
- కావాల్సినంత యూరియా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం
- గోడౌన్స్ లేవని టీ-సర్కార్ చెప్పడం విడ్డూరం
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు, ఆ పార్టీ నేత కవితకు లింక్ పెడుతూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన కవితను రైతులు ఓడించారన్న కక్షతో వారిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. యూరియాను నిల్వ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్నా, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. యూరియా నిల్వ చేసుకునేందుకు గోడౌన్స్ లేవని చెప్పి తెప్పించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలపై ఆయన ఆరోపణలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన యూరియాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తరలించుకుపోయారని ఆరోపించారు. దాదాపు 20 టన్నుల యూరియాను ఇతర జిల్లాలకు తరలించారని ఆరోపించారు. దీనిపై జిల్లా మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని, రైతులు నిరసన వ్యక్తం చేయకుండా ఉండాలంటే యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత యూరియా కావాలంటే అంత యూరియా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.