KCR: రేపు గవర్నర్ నరసింహన్ కు వీడ్కోలు... మరపురాని ఏర్పాట్లు చేయాలన్న కేసీఆర్!
- తొలుత రాజ్ భవన్ లో వీడ్కోలు కార్యక్రమం
- అనంతరం ఎయిర్ పోర్టులో గంటపాటు సాగనున్న వీడ్కోలు సత్కారం
- కొత్త గవర్నర్ గా 8న తమిళిసై బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు రేపు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకనుంది. రాష్ట్రానికి నూతన గవర్నర్ గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ నియమించబడిన సంగతి తెలిసిందే. ఆమె 8వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో నరసింహన్ కు ఘనమైన వీడ్కోలును పలకాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.
నరసింహన్ కు మరపురాని వీడ్కోలును అందించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. తొలుత రాజ్ భవన్ లో వీడ్కోలు సత్కారం అనంతరం నరసింహన్ ఫ్యామిలీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికేందుకు సీఎం సహా, మంత్రులంతా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. వీడ్కోలు కార్యక్రమం సుమారు గంట పాటు సాగుతుందని సమాచారం. ఆపై 7 గంటల సమయంలో ఆయన చెన్నైకి బయలుదేరి వెళతారు.