Chandrababu: చంద్రబాబు వచ్చినా రాని నేతలు... తూ.గో జిల్లాలో పార్టీకి దూరమవుతున్న పలువురు నేతలు!
- నిన్న చంద్రబాబు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం
- గైర్హాజరైన పలువురు సీనియర్ నేతలు
- బీజేపీలో చేరేందుకేనని ఊహాగానాలు
మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టుగొమ్మగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విధంగా పార్టీ విజయం సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ఆపై ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. తాజాగా, చంద్రబాబునాయుడు స్వయంగా జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించగా, పలువురు సీనియర్ నేతలు, పేరున్న లీడర్లు గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది.
టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా ప్రధాన నేతల్లో ఒకరైన తోట త్రిమూర్తులు హాజరు కాలేదు. ఈయన పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. త్రిమూర్తులుతో పాటు చలమలశెట్టి సునీల్, మాగంటి రూప, కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు దొరబాబు, మరికొందరు కార్పొరేటర్లు కూడా ఈ సమావేశానికి రాలేదు.
జిల్లా ముఖ్య నేతల్లో ఒకరైన వరుపుల జోగిరాజు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరింత మంది టీడీపీని వీడుతారని సమాచారం. వీరిలో అత్యధికులు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరంతా తమ తమ అనుచరులతో మంతనాలు సాగిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.